తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని మంగంపేటలో జూలై 2న నిర్వహించనున్న ప్రతిష్టాత్మక గ్రామీణాభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవ సభకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుకానుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు.
ఓబులవారిపల్లి మండలం ముక్కువారిపల్లి పంచాయతీ పరిధిలోని మంగంపేట వద్ద జరగనున్న ఈ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రముఖుల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు కలిసి సభా ప్రాంగణానికి సంబంధించిన అధికారిక నమూనా ప్రణాళికను పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు.
విశిష్ట అతిథుల రాక నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. హెలిప్యాడ్ నిర్మాణం, ప్రధాన వేదిక ఏర్పాటు, ప్రత్యేక అతిథుల కోసం ప్రత్యేక మార్గాలు, ప్రజల కోసం వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను రూపొందిస్తున్నారు. వేలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో రవాణా, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అగ్రనేతలు ఒకే వేదికపై పాల్గొననున్నందున ఈ సభను నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని తెలిపారు. సభకు వచ్చే ప్రజలు, మహిళలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు సభలో ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూలై 2న జరగనున్న ఈ కార్యక్రమం రాయలసీమ ప్రాంత రాజకీయ, అభివృద్ధి పరంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ విజయవంతం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news