సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశంలోనే ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలన్నదే తన ధ్యేయమని పేర్కొంటూ, ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రుల సమష్టి కృషితోనే “ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్” సాధ్యమవుతుందని చెప్పారు.
గత రెండేళ్లలో విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను ప్రభుత్వం పూర్తి చేసిందని, ఇప్పుడు ఉపాధ్యాయులు బోధన నాణ్యత, అభ్యసనా ఫలితాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, హార్డ్వేర్ పరంగా పాఠశాలలు మెరుగుపడ్డాయని, ఇక విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అందుకోసం బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
కొక్కిలిగడ్డ హైస్కూలులో ఇప్పటికే ఎక్కువశాతం మౌలిక సదుపాయాలు కల్పించామని, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ వంటి అవసరాలను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో తొలిసారిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇది ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం పెంచే చర్యగా పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి లీప్ యాప్ను అందుబాటులోకి తెచ్చామని, మధ్యవర్తుల అవసరం లేకుండా ఉపాధ్యాయులు తమ సమస్యలను తెలియజేయవచ్చని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్–టీచర్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని, తల్లిదండ్రులను చైతన్యపరచడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల చదువులో పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఇంటి వద్ద కూడా పిల్లల అభ్యసనంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు.
ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, జీఎఫ్ఎల్ఎన్ వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఉపాధ్యాయులు వివరించారు. భవిష్యత్తులో ప్రత్యేక కార్యాచరణ అవసరం లేకుండా విద్యార్థులు స్వయంగా మెరుగైన స్థాయికి చేరేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. పదో తరగతిలో బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, వారు విఫలమైతే సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులకు గుర్తుచేశారు.
మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పారదర్శక నియామక విధానాన్ని అభినందించగా, పాఠశాలలో ప్లేగ్రౌండ్, పాల్ ల్యాబ్ వంటి సదుపాయాల కోసం చేసిన విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చేరడం విద్యా రంగంలో వస్తున్న మార్పుకు నిదర్శనమని చెప్పారు.
విద్యార్థులతో మాట్లాడుతూ మంత్రి లోకేష్ చమత్కారంగా స్పందించారు. మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారని, మీరు చదవకపోతే తనకు మైనస్ మార్కులు పడతాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం యూనిఫారాలు, పుస్తకాలు, విద్యా కిట్లు, బూట్లు వంటి సదుపాయాలు అందిస్తోందని గుర్తుచేశారు. ఉపాధ్యాయులను గౌరవిస్తూ, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news