బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ జె.వెంకట్ వినోద్ కుమార్ పాల్గొని యోగాసనాలు వేశారు. సముద్ర తీరంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ప్రజలు పాల్గొని యోగా సాధన చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి ఆరోగ్యం, ఆనందం చేరాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రోజువారీ యోగా సాధన వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని పేర్కొన్నారు.
యోగాను నిత్యజీవితంలో అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి దోహదపడే సానుకూల ఆలోచనలు పెరుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు. మనందరం ఆరోగ్యంగా, ఆనందంగా, ఐక్యంగా జీవించాలని ఆకాంక్షించారు. అనేక మతాలు, కులాలు, సంప్రదాయాలు, సంస్కృతులు కలిసిన భారతదేశంలో జన్మించడం గర్వకారణమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ప్రస్తావిస్తూ పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. యోగా ద్వారా ఆరోగ్య సంరక్షణతో పాటు క్రమశిక్షణ, సానుకూల దృక్పథం పెంపొందుతుందని తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగా గురువులు, నిర్వాహకులు, అధికారులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే మాలకొండయ్య శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. యోగా విస్తరణకు కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత మంది ప్రజలు యోగా వైపు ఆకర్షితులవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీఓ హరికుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి చంద్రశేఖర్, డీఎఫ్వో రవిశంకర్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విమల, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ హాసిని, విద్యార్థులు, యోగా శిక్షకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సూర్యలంక తీరంలో నిర్వహించిన ఈ యోగా వేడుకలు ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news